తెలంగాణ ముఖ్యాంశాలు

పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం నింపి వ్యాపారిని మోసం చేసిన రైతు

ఈ ఏడాది పత్తికి మంచి రేటు పలుకుతుంది. క్వింటాకు ఏకంగా 9 వేల వరకు పలుకుతుంది. అయితే ఈసారి పత్తి దిగుబడి ఎక్కువ లేదు. భారీ వర్షాల కారణంగా పత్తి రైతులు నష్టపోయారు. మంచి రేటు ఉన్నప్పటికీ అధిక మొత్తంలో పత్తి దిగుబడి కాలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని వాపోతున్నారు. ఈ తరుణంలో పంట దిగుబడి సరిగా రాలేదనో.. పెట్టుబడి ఎక్కువైందనో.. అప్పులు తీర్చుకోవాలనే తాపత్రయంతోనో తెలియదు కానీ ఓ రైతు మాత్రం పత్తి బస్తాల్లో రేషన్ బియ్యం నింపి..వాటిని మార్కెట్ కు తీసుకొచ్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

కారేపల్లి మండలాలనికి చెందిన ఓ రైతు బుధవారం 35 పత్తి బస్తాలను కే సముద్రం మార్కెట్‌కు తీసుకొచ్చాడు. వీటిని ఓ ట్రేడర్‌ కంపెనీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. అనంతరం పత్తి నాణ్యతను చూసే క్రమంలో కాంటాపై తూకం వేశారు. బస్తాలు తూకం చేస్తుండగా.. ఎక్కువ బరువు తూగుతున్నాయి. అనుమానం వచ్చి బస్తాలను కత్తిరించి చూడగా..పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం కలుపుకొని వచ్చాడా రైతు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. మిగిలిన బస్తాలను కోసి పరిశీలించగా ఒక్కో బస్తాలో 4 నుంచి 5 కిలోల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు సదరు రైతు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులు ఇలాంటి పనులు చేయకూడదని గిట్టుబాటు ధర కోసం ప్రయత్నించాలని అధికారులు సూచించారు.