ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో రేషన్ బియ్యం కలకలం-ఈసారి విశాఖ పోర్టులో..!

ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరాంటంకంగా సాగిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా దందాకు మాత్రం చెక్ పడటం లేదు. ఇప్పటికే కాకినాడ పోర్టులో దొరికిన రేషన్ బియ్యంపై వివాదం కొనసాగుతుండగానే.. ఇవాళ విశాఖ పోర్టులో మరో దందా బయటపడింది.

ఇవాళ విశాఖ పోర్టును పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేట్ వే గా మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైజాగ్ పోర్ట్ లో తనిఖీలు చేశారు. ఇందులో అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా వున్న బియ్యాన్ని మంత్రు గుర్తించారు. దీన్ని సీజ్ చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. దీంతో మొత్తం 483 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి.

వాస్తవానికి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెరగడంతో రెండు నెలలుగా అక్రమార్కులు విశాఖ పోర్ట్ ను ఎంచుకున్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టుకు బదులుగా విశాఖ పోర్టు నుంచే విదేశాలకు అక్రమంగా రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.

ఇవాళ పట్టుకున్న బియ్యం రేషన్ బియ్యంగానే గుర్తించారు. అనంతరం దీన్ని మంత్రి దగ్గరుండి సీజ్ చేయించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఇలా రాష్ట్రంలోని రెండు పోర్టుల్లో రేషన్ బియ్యం భారీగా పట్టుబడటం కలకలం రేపుతోంది.