ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

చంపేస్తాం.. పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్.. రంగంలోకి స్పెషల్ టీమ్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు దుండగుడు. దీంతో పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజ్‌ల గురించి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తెలియజేశారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పెట్టిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. మెసేజ్‌‌లు , ఫోన్ కాల్స్ వివరాలను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీని వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు.

ఇటీవలే రేషన్ మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. పవన్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్లి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సముద్రం లోపలికి వెళ్లిన ఓడలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పవన్ పట్టుకుని కేసులు నమోదు చేయించారు. ఈ సంఘటన తర్వాతే ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ బెదిరింపుల వ్యవహారంలో రేషన్ అక్రమ రవాణా మాఫియా హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది.