తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని.. పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈరోజు సాయంత్రం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అంచనా. రేపటికి (డిసెంబర్ 11) నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా పయనిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 13 వరకు అక్కడక్కడ భారీవర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈనెల 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోగా.. అకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ వాతవరణం విషయానికొస్తే.. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందన్నారు. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అన్నారు. గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా.. 29 డిగ్రీల సెల్సియస్ నుంచి 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందన్నారు. ఉపరితల గాలులు దక్షిణ, నైరుతి దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీస్తాయని చెప్పారు.
ఏపీలో వర్షాలు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయన్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.