ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన తెలియజేసింది. ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్ ను తెలిపింది. జనవరి 1 నుంచి టికెట్ బుకింగ్ ఫై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. ఆర్టీసీ పోర్టల్, ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోమని కోరుతున్నారు.
ఇదిలా ఉంటె సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను ఏర్పటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. జనవరి 7 నుంచి 17 వరకు ఈ బస్సులు నడవనున్నాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.