దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రాల్లోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు దక్షిణాదిలో తమిళనాడులో అతి పెద్ద పండగ సంక్రాంతి సంబరాలకు ప్రజలు రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండగలో సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాలు, జల్లి కట్టు వంటి వాటిపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తిని నెలకొంది.
తాజాగా తమిళనాడులో జల్లికట్టు నిర్వహణపై నేడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. దక్షిణ తమిళనాడు ఇప్పటికే జల్లికట్టు పోటీలకు ముస్తాబవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులలో 85 శాతం ఓమిక్రాన్ గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు మరిన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళ సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మధురై జిల్లాలో ఈనెల 14 నుండి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి.