ప్రహరీ గోడను కూల్చివేశారని డికె అరుణ కుమార్తె ఫిర్యాదు
వైసీపీ నేత, వ్యాపారవేత్త పోట్లూరి వరప్రసాద్ (పివిపి)పై మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తన ఇంటి గోడను ఇతరులతో కలిసి బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని ఓకే విల్లాను డికే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇటీవల కొనుగోలు చేశారు. ఇంటి మరమ్మతుల్లో భాగంగా ప్రహరీ గోడను నిర్మించారు. కాగా, పివిపి అనుచరులు కొందరు శృతిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కొత్తగా కట్టిన ప్రహరీ గోడ షహా అక్కడున్న రేకులను కూల్చివేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబితో ధ్వంసం చేయించారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శృతి రెడ్డి ఫిర్యాదు మేరకు పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.