కాసేపట్లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం
ఏపీ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సత్యసాయి జిల్లాకు తన నియోజక వర్గమైన హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేసేవరకూ పోరాడతానని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అఖిలపక్ష నేతలను కలిశారు. వారందరితో కలిసి హిందూపురం నుంచి అనంతపురానికి బయలుదేరారు. ఆయన కాసేపట్లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. లేపాక్షి, చిలమత్తూరు, కొడి కొండ మీదుగా అనంతపురానికి ఆయన వెళ్తున్నారు.
కాగా, నిన్న బాలకృష్ణ హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మౌన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆయనకు మద్దతు తెలిపారు. పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనను కలిసి ఆందోళనను కొనసాగించాలని కోరారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా హిందూపురంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.