తెలంగాణ ముఖ్యాంశాలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ మోసం చేశారు: రేవంత్ రెడ్డి

మోడీ దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడ దగ్ధం చేయండి పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు

ఏపీ విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి, చర్చ లేకుండానే ఏపీని కాంగ్రెస్ విభజించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ఎక్కడికక్కడ మోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోడీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోడీ ప్రధాని అయ్యారని అన్నారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి… తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పారు. ఏపీ నేతలు ఎంతో ఒత్తిడి చేసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. ఒక రాష్ట్రంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు.