విపక్షాలపై సీఎం జగన్ విమర్శలు
నేడు జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రజలు కూడా కోరుకోరని తెలిపారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న ఏ ఒక్క కుటుంబం కూడా ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకోదని స్పష్టం చేశారు.
“మరి సమ్మె జరగాలని ఎవరు కోరుకుంటారో తెలుసా? ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా?… ఎవరికి కావాలంటే… చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే సమ్మె జరగడం కావాలి. పార్టీల పరంగా చూస్తే… ఎర్రజెండాల వారికి సమ్మె జరగడం కావాలి, బాబు దత్తపుత్రుడికి సమ్మె జరగడం కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతోందంటే వీళ్లకు పండుగ. ప్రభుత్వంతో సంధి జరిగి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంలేదని తెలియడంతో వీళ్లంతా ఏడుపు ముఖం పెట్టారు. సమ్మె విరమించడం వాళ్లకు నచ్చలేదు. అందుకే పచ్చజెండా ముసుగులో ఉన్న ఎర్రజెండా సోదరులను ముందుకు తోశారు. ముందు ఎర్రజెండా, వెనుక పచ్చజెండా అజెండా… ఇదీ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి!” అంటూ సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు.