జాతీయం ముఖ్యాంశాలు

అల్లరిమూకలకు బీజేపీయే విరుగుడు

అల్లరిమూకలు, ఆరాచక శక్తులు, నేరగాళ్లకు బీజపీయే విరుగుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పుడీ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రజలూ గుర్తించారన్నారు.   గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎలాంటి అల్లర్లూ జరగలేదనే విషయాన్ని ప్రస్తావించారు. యూపీలోని కనౌజ్‌లో శనివారం మోదీ  ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

యూపీలో తొలి దశ పోలింగ్‌ తర్వాత కుటుంబ పార్టీలకు కంటి మీద కునుకు కూడా కరువైందని అన్నారు. అధికారం కోసం ఇక కలలు కనలేరని అన్నారు. ఆ నాయకులందరూ ప్రభుత్వం అంటే కుటుంబం కోసం, కుటుంబం వలన, కుటుంబం చేత… అనుకుంటారని ఎద్దేవా చేశారు. మాఫియా నాయకుల్ని, అల్లరి మూకల్ని అరికట్టే సత్తా బీజేపీకే ఉందనేది ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలో ఉన్నపుడు విపక్షపార్టీలు శాంతిభద్రతలను కాపాడలేకపోయాయని ధ్వజమెత్తారు. అల్లర్లకు అడ్డుకట్టవేడయం, మాఫియాకు, గుండాలకు ముకుతాడు వేయడం యోగి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి ఈ సర్కారును కొనసాగించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.