జగన్‌ను దూషించారంటూ అయ్యన్నపై నల్లజర్లలో కేసు
కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సద్దుమణిగిన ఉద్రిక్తత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి కాసేపటిక్రితం ఊరట లభించింది. అకారణంగా పోలీసులు తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆ పిటిషన్‌లో ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని అయ్యన్నపాత్రుడిపై వైస్సార్సీపీ నేత రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు నల్లజర్ల పోలీసులు బుధవారం నాడు నేరుగా విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నుంచి నర్సీపట్నంలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలతో అయ్యన్న ఊపిరి పీల్చుకోగా.. అయ్యన్నను అరెస్ట్ చేయకుండానే నల్లజర్ల పోలీసులు వెనుదిగరక తప్పలేదు.