కొత్త జిల్లాలకు సరిపడా పోలీసులు, సిబ్బంది ఉన్నారు : ఏపీ డీజీపీ
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించి కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త జిల్లాలకు సరిపడా పోలీసులు, సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఇటీవలే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను కేటాయించిందని… అందువల్ల కొత్త జిల్లాలకు ఐపీఎస్ ల కొరత కూడా లేదని తెలిపారు.
అలాగే సచివాలయ పోలీస్ వ్యవస్థపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నుంచి గ్రామీణ పోలీస్ చట్టం అమల్లో ఉందని… గ్రామ స్థాయిలో పోలీస్ విజిలెన్స్ కోసం సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరమని చెప్పారు. వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుపుతోందని… అందువల్ల ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదని అన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి ఎక్కువగా సాగవుతోందని… దీన్ని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. గంజాయి సాగు ఎప్పటి నుంచో ఉందని… ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాన్ని కట్టడి చేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. గంజాయిని నియంత్రించేందుకు కాలేజీలు, రిసార్టులపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని తెలిపారు.