భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాల తయారీ విధానంపై ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. కోవాగ్జిన్ టీకాల్లో అప్పుడే పుట్టిన దూడ పిల్లల ద్రవాలను వినియోగించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది. వాస్తవాలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొన్నది. లేత దూడ ద్రావాలను (సీరం) .. వీరో కణాల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వీరో కణాల అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఆవులు, ఇతర జంతువుల ద్రవాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో జీవకణాల అభివృద్ధి కోసం వీరో సెల్స్‌ను వాడుతారు. ఇదే తరహా టెక్నిక్‌తో గత కొన్ని దశాబ్ధాల నుంచి పోలియో, రేబిస్, ఇన్‌ఫ్లూయాంజా టీకాలను అభివృద్ధి పరిచినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో వెల్లడించింది.
వీరో కణాలను(వీరో సెల్స్) వృద్ధి చేసిన తర్వాత.. వాటిని నీటితో, బఫర్ కెమికల్స్‌తో శుద్ధి చేస్తారు. దూడల సీరంను వేరు చేసే ప్రక్రియలో భాగంగా అనేక సార్లు వీరో కణాలను శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీరో కణాలకు కరోనా వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ చేస్తారని, ఆ విధానం ద్వారా వ్యాక్సిన్ డెవలప్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ను వృద్ధి చేసే క్రమంలో వీరో కణాలను సంపూర్ణంగా నాశనం చేస్తారు. అంతేకాదు.. వృద్ధి చేసిన వైరస్‌ను చంపేస్తారు. దాన్ని ఇనాక్టివేట్ చేసి.. శుద్దీకరిస్తారు. ఆ చనిపోయిన వైరస్‌తోనే తుది వ్యాక్సిన్‌ను రూపొందిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఫైనల్ వ్యాక్సిన్ తయారీలో ఎటువంటి కాల్ఫ్ సీరమ్ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే కోవాగ్జిన్ టీకాలో దూడ ద్రవం ఉండదని పేర్కొన్నది.
కోవాగ్జిన్ టీకాల్లో ఆవుల ద్రవాలను వాడారని, వాక్సిన్ల తయారీ కోసం ఆవులను చంపుతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.