పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం.. హోం మంత్రి సుచరిత
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గబోదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును ఖచ్చితంగా సవాల్ చేసి తీరతామని ఆమె పేర్కొన్నారు.
శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంటును ఆమె ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని కూడా ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని ఆమె వెల్లడించారు.