అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం యూరోప్‌లో పర్యటించనున్నారు. బ్రసెల్స్‌లో ఉన్న నాటో కార్యాలయంలో ఆయన అక్కడి నేతలతో ముచ్చటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఆయన పోలాండ్‌లోనూ ఆ దేశాధ్యక్షుడిని కలవనున్నారు. రష్యా దాడి చేపట్టడంతో.. ఉక్రెయిన్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పోలాండ్‌కు వలస వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది శరణార్థులు పోలాండ్‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే యూరోప్ దేశాల టూర్‌లో భాగంగా మొదట బ్రసెల్స్‌లో బైడెన్ పర్యటిస్తారు.
ఆ తర్వాత ఆయన పోలాండ్ రాజధాని వార్సాలో దేశాధ్యక్షుడి ఆండ్రేజ్ దుడాతో భేటీ అవుతారు. ప్రస్తుతం పోలాండ్‌లోనే వేల సంఖ్యలో అమెరికా దళాలు ఉన్నాయి. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో శరణార్థుల తరలింపు ప్రక్రియ గురించి బైడెన్ తెలుసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లతో బైడెన్ సోమవారం చర్చలు నిర్వహించనున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది. ఉక్రెయిన్‌కు బైడెన్ వెళ్లే ఆలోచనలో లేరని జెన్‌సాకి తెలిపారు.