తమకు సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్
రష్యాకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
నాటో దేశాలు, కూటమిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. ఇన్నాళ్లూ నాటో సభ్యత్వం తమకు అవసరం లేదని చెప్పిన ఆయన.. ఇప్పుడు మాట మార్చారు. తమను నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రష్యాకు నాటో కూటమి భయపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు నాటోలో సభ్యత్వం ఇవ్వాలని, లేదంటే రష్యాకు భయపడుతున్నామంటూ నాటో బహిరంగంగా ఒప్పుకోవాలని ఆయన సవాల్ చేశారు. తమకు నాటోలో సభ్యత్వం లేకపోయినా భద్రతకు హామీ ఇచ్చే నాటో దేశాలున్నాయన్నారు.
ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలన్న రష్యా డిమాండ్ ను ఆయన తోసిపుచ్చారు. ఖర్కివ్, మేరియపోల్, కీవ్ లలో రష్యా అలాంటి డిమండ్లనే పెడుతోందని, ఒకవేళ వాటిని ఆక్రమించుకోవాలనుకుంటే అక్కడి ప్రజలందరినీ రష్యా చంపాల్సి ఉంటుందని అన్నారు. నాజీల అడుగుల్లో నడుస్తున్న రష్యా.. రివర్స్ లో తమనే నాజీలంటూ ఆరోపిస్తోందని మండిపడ్డారు.