తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. ఏకంగా 495 కోట్ల రూపాయల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, హోంమంత్రి మహబూద్ అలీ, ఎమ్మెల్యేలతో కలిసి పాతబస్తీలో పర్యటించిన కేటీఆర్.. ముందుగా మీరాలం చెరువులోని మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ప్రారంభించారు. 2 కోట్ల 55 లక్షలతో పూర్తిచేసిన ఈ మల్టీమీడియా మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. చెరువులో తీగల వంతెనతో పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్, చుట్టూ కాలిబాట, సైకిల్ ట్రాక్, పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..మతం,కులంతో చిల్లర రాజకీయాలు చెయ్యబోమని.. న్యూ సిటీతో పోటీ పడుతూ ఓల్డ్ సిటీని అభివృద్ధి చేసి తీరుతామని..ఇది తమ కమిట్మెంట్ అని అన్నారు. మొజంజాహి మార్కెట్ ను అద్భుతంగా రేనోవేట్ చేశామన్నారు. సర్దార్ మహల్ ను టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేస్తామన్నారు. చాలా రోజుల నుంచి ఉన్న ట్రాఫిక్ సమస్య కు బహదూర్ పుర ఫ్లై ఓవర్ తో చెక్ పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్లై ఓవర్లు నిర్మిస్తామన్నారు. ఓల్డ్ సిటీకి సంబందించిన సివేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను తీసుకొస్తామన్నారు. ఎలాంటి ఎన్నికలు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తున్నామంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.