ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఇరువురూ కలిసినా.. తొలిసారి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏ, ఏ అంశాలు చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మర్యాదపూర్వకంగా సమావేశమవుతున్నారా.. ఇంకేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
జగన్ అధికారం చేపట్టగానే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే కొన్ని లోపాలను సరిదిద్దుకొని మరోసారి మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతామని.. జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అయితే మూడు రాజధానుల్లో కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న సీఎం జగన్ .. నేడు హై కోర్టు జస్టిస్ తో హైకోర్టు తరలింపుకు సంబంధించి సీజేఐతో చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.