తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలకు సమీపాన హెబిటేట్ రెస్టారెంట్ పక్కన ఏర్పాటు చేసిన మొబైల్ థియేటర్ ప్రారంభమైంది. సినిమా అనేది ఇప్పుడు అత్యాధునికమైంది. ఒకప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ టూరింగ్ టాకీసులే ఉండేవి. వీటికి ఇప్పుడు మల్టీప్లెక్స్ హంగులు కల్పించారు. ఇక ఇప్పుడు తొలి మైబైల్ సినిమా ధియేటర్ రాజానగరంలో ప్రారంభమైంది. ఏంటి ఈ మొబైల్ థియేటర్ అంటే.. ఓల్డ్ ఈజ్ ఎవర్ గోల్డ్.. నాటి టూరింగ్ టాకీసులకు కాస్త హంగులు, టెక్నాలజీ అద్దితే అదే మొబైల్ థియేటర్.
సినీ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త హంగులతో, టెక్నాలజీతో , సౌకర్యాలతో తొలి మొబైల్ థియేటర్ ఏర్పటుచేసారు. ఢిల్లీకు చెందిన పిక్చర్ డిజిటల్స్ సంస్థ దీనిని నిర్మించింది. జీఎస్‌ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సోమవారం దీనిని ప్రారంభించారు. ‘పిక్చర్ టైమ్’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ థియేటర్ గ్రామీణ ప్రాంతాల వారికి ఐమాక్స్‌లో సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులలో ఒకరైన చైతన్య తెలిపారు.
ఇన్‌ఫ్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ (గాలి నింపిన టెంట్)తో తయారైన ఈ థియేటర్ అన్ని వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకుంటుందన్నారు. 35 ఎంఎం స్క్రీన్‌తో, 120 సిటింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌కి ఏడాది పాటు అనుమతులున్నాయని, ఈనెల 29న విడుదలయ్యే ఆచార్య సినిమాతో రెగ్యులర్ షోలు వేస్తామని చెప్పారు. ఆన్‌లైన్‌తోపాటు బుకింగ్ కౌంటర్‌లోను లభించే టికెట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తాయన్నారు.