ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షత వహిస్తూ చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎంపీపీ పావని నిలదీసింది. దీంతో ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ మధ్య కొంతసేపు మాటల యుద్ధం నడిచింది. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుండగా ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈక్రమంలో లబ్ధిదారులు ఆందోళన గురయ్యారు. అసలే చెక్కుల కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నామని, ఈ సమయంలో మీ గొడవలు ఏంటని ప్రశ్నించారు. చెక్కులు పంపిణీ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న చెక్కుల పంపిణీని అడ్డుకోవడానికి ఈటల వర్గీయులు ఇలా మాట్లాడుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ ఆరోపించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదనలు పెరుగగా, ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగజేసుకొని సముదాయించారు. అనంతరం సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.