ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రేపల్లె అత్యాచార ఘటన ఫై నాదెండ్ల మనోహర్ స్పందన

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా అవుతుంది. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళా ఫై అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వ చట్టాలకు , పోలీసుల శిక్షలకు కామాంధులు ఏమాత్రం భయపడడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే కామాంధులు రెచ్చిపోతూ వారి కోరిక తీర్చుకుంటున్నారు. మొన్న విజయవాడ , నిన్న గుంటురు , ఈరోజు రేపల్లె..ఇలా ప్రతి రోజు అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్తను దారుణంగా కొట్టి, అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఏపీలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియజేస్తోందని వెల్లడించారు.

గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, కానీ సీబీఐ దత్తపుత్రుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ స్పందించడంలేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం గర్హనీయమని పేర్కొన్నారు. హోంమంత్రి ప్రకటనలు సైతం ప్రభుత్వం తీరును వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలకు తల్లులే కారణమని, వాళ్లు సరిగా లేకపోవడమే కారణమని చెప్పడం విచిత్రంగా ఉందని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. రేపల్లె సామూహిక అత్యాచార ఘటనలో ఏ తల్లి తప్పు ఉంది? అని నిలదీశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి ఏ తల్లి తప్పిదమో బాధ్యత కలిగిన హోంమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.