తెలంగాణ ముఖ్యాంశాలు

ఈరోజే వరంగల్ లో రాహుల్ సభ..

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు , కార్య కర్తలు ఎదురుచూస్తున్న రాహుల్ సభ మరికొన్ని గంటల్లో మొదలుకాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ రెండు రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈరోజు సాయంత్రం హన్మకొండ లో జరిగే రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొంటారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేయబోయే… వ్యవసాయ విధానాన్ని రాహుల్‌ ప్రకటిస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు… పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జవసత్వాలను నింపుతుందని, ఎన్నికల దిశగా కదం తొక్కేలా స్ఫూర్తిని నింపుతుందని పీసీసీ భావిస్తోంది. మరోవైపు రాహుల్ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాహుల్ కు వ్యక్తిగతంగా ఎన్ఎస్జీ కమెండోలు సెక్యూరిటీగా ఉంటారు. ఎన్ఎస్జీ కమెండోలు వేదిక చుట్టూ వలయంలా ఉంటారు. వరంగల్ కు ఇప్పటికే సుమారు 50 మంది కమెండోలు వచ్చినట్టు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో పర్యవేక్షణ ఉంటుంది. దీనికి తోడు వరంగల్ పోలీసులు పెద్ద సంఖ్యలో రాహుల్ భద్రత విధుల్లో ఉంటారు. ఒక డీసీపీ, ఏడుగురు ఏసీపీలు, 29 మంది ఇన్స్ పెక్టర్లు, 60 మంది ఎస్ఐలు, 132 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 836 మంది వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తుంటారు.

ఈ సభను విజయవంతం చేయాలనీ 15 రోజుల నుంచి నేతలు విస్తృత ఏర్పాట్లు చేసారు. సభకు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి… అధికారం కైవసం చేసుకునేందుకు… ఈ సభ ద్వారానే శ్రీకారం చుడతామని నేతలంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ఏం చేస్తామో చెప్పేందుకు… వరంగల్ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ సభలో ప్రకటించనున్నారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.

రాహుల్‌ ఢిల్లీ నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు… శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని… అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 5 గంటల 45 నిమిషాలకు హన్మకొండ కు వస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు.