జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం బిజెపి తోనే ఉన్నామని , వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటామనేది ఇప్పుడే చెప్పలేం అని , రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. ఆదివారం పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించారు. పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు కుటుంబానికి పవన్ భరోసా ఇచ్చారు. కౌలు రైతు భార్య భూలక్ష్మికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.., పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని అన్నారు. ఇవాళ్టికీ తమకు భాజపాతోనే పొత్తు ఉందని.., ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం భాజపా నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పొత్తుకోసం తెదేపా ఆహ్వానిస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు.. రాష్ట్ర భవిష్యత్, ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తామంటూ చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. వ్యూహాలే ఉంటాయని పవన్ అన్నారు. మేం సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరు ఎవరని ప్రశ్నించారు. తనకు పదవులు అక్కర్లేదని.. డబ్బుపై వ్యామోహం లేదుని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తానేప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తానని.., ప్రజల కన్నీరు తుడవని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్న పవన్.. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు.