తెలంగాణ ముఖ్యాంశాలు

6 నెలలు యువత సామాజిక మాధ్య‌మాల‌ను వాడకూడ‌దు : మంత్రి కేటీఆర్‌ 6 నెల‌లు ఉద్యోగాల కోసం పోటీప‌డి సాధించాలని పిలుపు

మంత్రి కేటీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌లో ఉద్యోగార్థులకు కేటీఆర్ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సామాజిక మాధ్య‌మాల‌ను వాడకూడ‌ద‌ని, వాటికి దూరంగా ఉంటూ ఉద్యోగాల కోసం పోటీప‌డి సాధించాలని చెప్పారు. తెలంగాణ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్ర‌క‌ట‌న చేశార‌ని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన‌ విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులను మునిసిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని చెప్పారు.