ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశ రాజధాని కీవ్‌లో మూసివేసిన భారత రాయబార కార్యాలయం తిరిగి తెరుచుకోనున్నది. ఈ నెల 17 నుంచి భారత ఎంబసీని పునరుద్ధరించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొన్నది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడిని రష్యా ప్రారంభించింది. రాజధాని కీవ్ స్వాధీనం కోసం ప్రయత్నించింది. బాంబులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు, పౌరులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి భారత్‌కు తరలించారు. అనంతరం మార్చి 13 నుంచి ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం సేవలను పొలాండ్ రాజధాని వార్సా నుంచి కొనసాగించారు.
కాగా, మరోవైపు రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చింది. కీవ్ స్వాధీనంపై వెనక్కి తగ్గింది. మరియుపోల్ వంటి తీర ప్రాంత నగరాలపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించాలని కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వార్సా (పోలాండ్) నుండి తాత్కాలికంగా పనిచేస్తున్న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం 17 మే నుంచి కీవ్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది’ అని అందులో పేర్కొంది.