@PresTrumpTS పేరిట కొత్త ఖాతాను తెరిచిన ట్రంప్
రోజుల వ్యవధిలోనే గుర్తించి..మళ్లీ నిషేధం విధించిన ట్విట్టర్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ట్విట్టర్ నుంచి షాక్ తిన్నారు. ఇదివరకే 2021లో తనపై నిషేధం విధిస్తే.. తాజాగా ఆయన పేరు (ట్విట్టర్ హ్యాండిల్) మార్చుకుని సోషల్ మీడియా దిగ్గజంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే కేవలం రోజుల వ్యవధిలోనే ట్రంప్ రీ ఎంట్రీని గుర్తించిన ట్విట్టర్ మరోమారు ఆయనకు షాక్ ఇస్తూ నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన హఫ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ఈ దిశగా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్విట్టర్ వేదికగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ అమెరికా రాజధానిపై దాడికి దిగేలా చేశారన్న ఆరోపణలతో 2021లో ఆయనను ట్విట్టర్ నిషేధించింది. అయితే తన భావాలను వ్యక్తీకరించేందుకు ట్విట్టర్‌కు పోటీగా ట్రూత్ సోషల్ పేరిట ట్రంప్ వేరే వేదికను ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటిదాకా ట్రంప్ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
అయితే తాజాగా @PresTrumpTS పేరిట ఓ ట్విట్టర్ ఖాతాను తెరచిన ట్రంప్.. ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేస్తున్న విషయాలన్నింటినీ ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేస్తూ వస్తున్నారట. దీనిని గుర్తించిన మరుక్షణమే ఈ ఖాతాను కూడా నిషేధిస్తూ ట్విట్టర్ వేగంగా స్పందించింది. రెండు రోజుల క్రితం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేసిన అంశాల్లో 21 అంశాలు ట్విట్టర్‌లోనూ కనిపించాయట. అంతేకాకుండా ఈ ట్వీట్లకు ‘ప్లీజ్ ఫాలో అండ్ రీ ట్వీట్’ అంటూ ట్రంప్ రిక్వెస్ట్‌లు కూడా పోస్ట్ చేశారట.