నేటి నుంచి తెలంగాణ సీఎం ఢిల్లీ టూర్
రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శించనున్న కెసిఆర్
జాతీయ స్థాయి పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సిఎం కెసిఆర్ పరామర్శించనున్నారు.
కెసిఆర్ పర్యటన వివరాలు :
శుక్రవారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు.
మే 22 న మధ్యాహ్నం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి కెసిఆర్ అందచేస్తారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన.. పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు.
మే 26 ఉదయం… సిఎం కెసిఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు.
మే 27న బెంగళూరు నుంచి రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కెసిఆర్ భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సిఎం కెసిఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.
మే 29 లేదా 30 న బెంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు సిఎం కెసిఆర్ సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను కెసిఆర్ ఆదుకోనున్నారు.