టోక్యోలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో పాల్గొననున్న మోడీ
ప్రధాని మోడీ నేడు , రేపు జపాన్ లో పర్యటించనున్నారు. జపాన్ లో రేపు జరిగే క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం టోక్యో చేరుకున్న మోడీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. అక్కడి హోటల్ న్యూ ఒటానీలో మోడీ బస చేస్తున్నారు.
అక్కడి ప్రవాస భారతీయులు ‘మోడీ మోడీ ’, ‘ వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. భారత జాతీయ జెండాలు ఊపుతూ మోదీకి స్వాగతం పలికారు. వారితో కాసేపు మోడీ ముచ్చటించారు. చిన్నారులతోనూ మోడీ మాట్లాడారు. వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను చిన్నారులు పట్టుకుని మోడీకి స్వాగతం పలికారు.