తెలంగాణలో ఓ విదేశీ కంపెనీకి చెందిన రైల్ కోచ్ తయారీ యూనిట్ వచ్చేస్తోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కంపెనీ తెలంగాణలో ఈ రైల్ కోచ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ కింద స్టాడ్లర్ రైల్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ జాయింట్ వెంచర్ తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా బుధవారం తెలంగాణ ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. స్టాడ్లర్ రైల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్ అన్స్‌గర్ బ్రాక్‌మేయర్‌తో భేటీ సందర్భంగా ఈ ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఈ కోచ్ తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారనుందని కేటీఆర్ వెల్లడించారు.