టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల నుంచి ఈడీల వరకు, ఏజెంట్ల నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అందరిని అభినందిస్తూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
కేవలం సర్వీసు బస్సుల ద్వారా 32 లక్షల పార్శిల్స్ చేరవేయడంతో రూ. 34 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కార్గో బస్సుల ద్వారా రూ. 12 కోట్ల ఆదాయం రాగా, మొత్తం రూ. 46 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు. 177 బస్ స్టేషన్ కౌంటర్లు, 810 మంది ఏజెంట్లతో కొనసాగుతున్న కార్గో, పార్శిల్ సేవలను మరింత విస్తరించే క్రమంలో రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా హోం డెలివరీ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. వినియోగదారులు పార్శిల్, కార్గో సేవల్ని మరింత ఆదరించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.