కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడిన విషయం విదితమే. ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ కూడా కరోనా బారిన పడి, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయింది. తన భార్య ఆక్సిజన్ కొరతతో చనిపోవడంతో.. భర్త ఓ నిర్ణయానికి వచ్చాడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించాలనే ఉద్దేశంతో భారీగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన 15 ఏండ్ల కుమారుడు పూర్వతో కలిసి తండ్రి ధ్రువాల్ పటేల్ 450 మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచాడు.
ఈ సందర్భంగా ధ్రువాల్ పటేల్ మాట్లాడుతూ.. తన భార్య నేహా అంత్యక్రియలు సిద్ధ్‌పూర్‌లో నిర్వహించామని, అక్కడ ఓ పూజారి కనీసం 3 మొక్కలు నాటాలని చెప్పాడు. అంత్యక్రియలకు మనం ఉపయోగిస్తున్న కలప వేరొకరు ఇస్తున్న బహుమతి అని పూజారి చెప్పినట్లు పటేల్ తెలిపాడు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు కలప కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పూజారి చెప్పిన విధంగా మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ తీసుకున్నానని పటేల్ తెలిపాడు.
కరోనా సెకండ్ వేవ్‌లో పటేల్ నివాసంలో ఐదుగురిలో నలుగురికి కరోనా సోకింది. ధ్రువాల్, నేహాతో పాటు కుమారుడు, తండ్రి కరోనా బారిన పడ్డారు. కానీ నేహా ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. తన భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానని, 17 ఏండ్ల అన్యోన్య దాంపత్య జీవితంలో నేహాను విడిచి ఉండలేదని పటేల్ తెలిపాడు. ధ్రువాల్, నేహాకు 2004లో వివాహమైంది.