తెలంగాణకు హరితహారం ఏడో విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కోటికి పైగా మొక్కలు నాటనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 14,68,017 మొక్కలు అదేవిధంగా 481 గ్రామ పంచాయతీల్లో 90,29,211 మొక్కలను నాటనున్నట్లు వెల్లడించారు.
హరితహారం కార్యక్రమంపై ఇటీవలే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్ ప్రతి వార్డులో ట్రీ పార్క్ ఏర్పాటు చేయాలని అన్ని మునిసిపాలిటీల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో, పట్టణాల్లో అవెన్యూ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం భూములను గుర్తించాలన్నారు. హరిత హరం కార్యక్రమాన్ని ప్రారంభించిన 15 రోజుల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కాలువలు, చెరువులు, నీటిపారుదల ప్రాజెక్టుల వెంట మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వనున్నట్లు తెలిపారు.