తెలంగాణ ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు

బాధితురాలి వివరాలు బయటపెట్టారంటూ కేసు నమోదు

బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ అంశం ప్రకంపనలు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అంశంపై మీడియా సమావేశాన్ని నిర్వహించిన రఘునందన్ రావు… ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితురాలి వివరాలను బయటపెట్టకూడదని ఆదేశాలున్నాయని చెప్పారు. ఎవరు వీడియోలు తీశారు? ఎందుకు తీశారు? అనే విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.