తెలంగాణాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు తీపి కబురు తెలిపింది రాష్ట్ర సర్కార్. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉచిత బియ్యాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కేంద్రం ఇచ్చే 5 కేజీల ఉచిత బియ్యానికితోడు మరో 5 కేజీలు అంటే మొత్తం ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున రేషన్ అందిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు 10 కిలోలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతోనే ఏప్రిల్, మే నెలల్లో ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయలేకపోయామని మంత్రి గంగుల తెలిపారు.
ఈ నెల 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఉంటుందన్నారు. కరోనా కాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఏప్రిల్, 2020న కేంద్రం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ద్వారా 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించింది. కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌లు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో ఈ పథకాన్ని కేంద్రం పొడగిస్తూ వచ్చింది. ప్రస్తుత సంవత్సరంలో మార్చి నెల నుంచి మరో ఆర్నెళ్ల పాటు ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ అన్న యోజనా పథకం కింద అర్హులైన పేదలందరికీ ఉచిత బియ్యం అందించనున్నారు.