తెలంగాణ ముఖ్యాంశాలు

రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి మండలి సమీక్షించనుంది. లాక్‌డౌన్‌ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చించనుంది. కరోనా పాజిటివ్‌ కేసులు, రికవరీ, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతోపాటు గోదావరి నుంచి నీటి ఎత్తిపోత, జలవిద్యుదుత్పత్తి, కృష్ణాపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడికాల్వ నిర్మాణం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన, ఇంటర్‌ ఫలితాలు, పాఠశాలలో వసతుల కల్పన అంశాలపైనా చర్చ జరగనుంది. రాష్ట్రంలో ఇవాళ్టితో లాక్‌డౌన్‌ ముగియనున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన దృష్ట్యా లాక్‌డౌన్‌ ఆంక్షలనూ ప్రభుత్వం సడలించే అవకాశం ఉంది.