తెలంగాణ ముఖ్యాంశాలు

నేడు మమతా బెనర్జీతో సమావేశానికి టీఆర్ఎస్ దూరం

కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టీఆర్ఎస్ అసంతృప్తి

ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ తరఫున కూడా ఎవరినీ పంపరాదని నిశ్చయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించవద్దని మమతను కోరినా, ఫలితం లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ప్రగతిభవన్‌లో ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఢిల్లీలో విపక్షాల భేటీకి హాజరు కావాలా, వద్దా అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. చివరకు వెళ్లకూడదనే నిర్ణయించారు. ఇందుకు కేసీఆర్‌ ప్రధానంగా నాలుగు కారణాలను పేర్కొన్నట్లు

గత ఎనిమిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌లకు టీఆర్ఎస్ సమదూరం పాటిస్తుండడం, ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంగా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా తెరాస అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవడం, మమత సమావేశం నిర్వహిస్తున్న తీరే సరిగా లేకపోవడం.. ఈ కారణాలతో కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘వీటన్నిటి దృష్ట్యా ఢిల్లీలో కాంగ్రెస్‌ పాల్గొనే విపక్ష సమావేశానికి హాజరైతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’.. అని కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికే ప్రధానాంశమైనప్పటికీ.. తెలంగాణలో తమకు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ హాజరయ్యే సమావేశానికి వెళ్లడం వల్ల ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నామనే భావన ప్రజల్లో వస్తుందన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైనట్లు తెలిసింది.

మమతా బెనర్జీ ఇటీవల తనకు ఫోన్‌ చేసినప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని కోరానని పార్టీ నేతలకు సీఎం వివరించినట్లు తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ స్పందనను తెలుసుకోవాలని సూచించానని ఆయన వెల్లడించినట్లు సమాచారం. అయినా మమత కాంగ్రెస్‌ను ఆహ్వానించారని, అందువల్ల ఆ సమావేశంలో తాను పాల్గొనడం సబబు కాదని భావిస్తున్నానని కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఖరారయ్యాక, తమను సంప్రదిస్తే మద్దతు విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.