జాతీయం ముఖ్యాంశాలు

‘అగ్నిపథ్’ పథకం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వయో పరిమితి పెంపు..అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి 21 నుంచి 23 ఏళ్లకు పెంపు

భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది.

తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. అయితే, ఇది ఈ ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని, ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం చెప్పింది.

ఈ ఏడాదికి గాను అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమిస్తారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరికి పెన్షన్ తో పాటు మాజీ సైనికులకు కల్పించే ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూపీ, బీహార్, హర్యానా, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.