కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ తాజా సమాచారం విడుదల చేసింది. కరోనా అనంతర సమస్యలతో సోనియా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్తం రావడంతో ఈ నెల 12వ తేదీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా చేరారని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారని చెప్పింది. గురువారం ఉదయం మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారని తెలిపింది.
ఈ క్రమంలో సోనియా శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దానితో పాటు కరోనా తర్వాతి సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. సోనియా ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సమాచారం) జైరాం రమేశ్ లేఖ విడుదల చేశారు.