తెలంగాణ ముఖ్యాంశాలు

దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా?: కేటీఆర్

అదానీకే ప్రాజెక్టు వచ్చేలా లంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణ

మంత్రి కేటీఆర్ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు.

శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై మోడీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోడీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.

దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోడీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.