తెలంగాణ ముఖ్యాంశాలు

కేసీఆర్ రైతుబిడ్డ కాబ‌ట్టే రైతుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్నారు : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్ర‌వ‌ర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేద‌లు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామ‌ని చెప్పారు. రెడ్డి కార్పొరేష‌న్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే చ‌ర్చించి నిర్ణ‌యం వెల్ల‌డిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తి కులంలో పేద‌వారు ఉన్నారు.. అలానే రెడ్డిల్లో కూడా పేద‌లు ఉన్నార‌ని తెలిపారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో కుల‌మ‌తాలు ఏవైన‌ప్ప‌టికీ.. పేద‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భార‌త‌దేశంలో జ‌ర‌గ‌ని అభివృద్ధి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సాధ్య‌మైంద‌న్నారు. కేసీఆర్ రైతుబిడ్డ కాబ‌ట్టే రైతుల సంక్షేమం కోసం పాటుప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు రైతుల ఖాతాల్లో జ‌మ అవుతుంద‌న్నారు. సిరిసిల్ల జిల్లాలో భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌న్నారు. సిరిసిల్ల‌లో మెడిక‌ల్ కాలేజీ నిర్మించుకోబోతున్నామ‌ని తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో త‌న‌కు మంత్రి పదవి వచ్చింది. త‌న ఒంట్లో శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌తి కుల సంక్షేమానికి కృషి చేస్తాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.