తెలంగాణ ముఖ్యాంశాలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫై దాడి కేసు : ఆవుల సుబ్బారావే మొత్తం చేసాడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫై దాడి కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఆవుల సుబ్బారావు ను ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘‘అగ్నిపథ్’’ను వ్యతిరేకిస్తూ..గత వారం సికింద్రాబాద్ రైల్లేస్టేషన్‌లో ఆందోళనకారులు బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అగ్ని గుండంగా మార్చి, కోట్ల నష్టం తీసుకొచ్చారు. ఈ దాడిలో పలువుర్ని అరెస్ట్ చేసి వారి నుండి సమాచారం రాబట్టారు. కాగా ఈ దాడిలో ప్రధాన సూత్రధారిగా సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ సుబ్బారావు ను అనుమానించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించగా..ఈ దాడి వెనుక మొత్తం కథ నడిపింది సుబ్బారావే అని తేలింది.

జూన్‌ 16న సుబ్బారావు అనుచరులతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ హోటల్‌లో దిగాడు. ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డిలతో మాట్లాడాడు. వారి ద్వారా ఆర్మీ విద్యార్థులను రప్పించుకుని ఆ రోజు రాత్రి సమాలోచనలు జరిపాడు. మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. లోటుపాట్లుంటే అప్పటికప్పుడు సరిచేసేందుకు వీలుగా అనుచరులనూ మాస్కులతో స్టేషన్‌లోకి పంపించాడు. విధ్వంసం మొదలైన కొద్దిసేపటికి గుంటూరుకు పారిపోయాడని రైల్వే పోలీసులు గుర్తించారు. విధ్వంసం ప్రారంభమైన అరగంట వ్యవధిలోనే పదిహేను మంది పోలీస్‌ అధికారులు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్న సభ్యుల ఫోన్‌ నంబర్లన్నింటినీ పరిశీలించారు. అభ్యర్థులు రూపొందించుకున్న ఎనిమిది వాట్సాప్‌ గ్రూపులకుగానూ నాలుగింటిలో సుబ్బారావు సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ నంబరు తెలుసుకున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆయనకు నేరుగా ఫోన్‌చేసి “సుబ్బారావ్‌ ఎక్కడున్నావ్‌” అనగానే ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమై మాస్కులతో స్టేషన్‌లోకి వెళ్లిన అనుచరులకు ఫోన్‌ చేసి పారిపోండంటూ ఆదేశాలిచ్చాడు. అనంతరం హోటల్‌ ఖాళీ చేసి గుంటూరుకు వెళ్లిపోయాడని దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు.