తెలుగువారు ఎక్కడ ఉన్నా… భాషే వారిని ఏకం చేస్తుంది.. జస్టిస్ ఎన్వీ రమణ
అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. దైనందిన జీవితాల్లో అనేక పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఇండో అమెరికన్ సదస్సులో పాల్గొన్న అందరికీ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. నేడు మినీ ఇండియాలో ఉన్నట్లుగా ఉందని సీజేఐ హర్షం వ్యక్తం చేశారు.
‘‘ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానిది కీలక పాత్ర. సాంకేతిక ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. మౌలిక సదుపాయాల వృద్ధి వేగంగా పెరిగింది. అమెరికాకు రావడమనేది సామాన్యుడికి కలగా ఉండేది. నూతన ఆవిష్కరణల్లో భారత్ ముందుంది. ఆవిష్కరణల్లో ప్రపంచంతో భారత్ పోటీ పడుతోంది. ఆలోచనల్లో మార్పు రాకపోతే ముందడుగు వేయలేం. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తేనే మార్పు సాధ్యమవుతుంది. ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి రావాలి. మీరు ఎంత సంపన్నులైనా శాంతి అనేది అవసరం. సమాజంలో ప్రశాంతత లేకుంటే హాయిగా జీవించలేము. సమాజ అభివృద్ధి కోసం ప్రవాసులు నాయకులుగా ఎదగాలి’’ అని సీజేఐ పేర్కొన్నారు.
”తెలుగుతల్లి ముద్దుబిడ్డలందరికీ నమస్కారం. ఎన్టీఆర్‌తో తెలుగువారికి గుర్తింపు వచ్చింది. తెలుగువారు ఎక్కడ ఉన్నా.. భాషే వారిని ఏకం చేస్తుంది. విశ్వమానస సౌభ్రాతృత్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలి. భారత్‌లో సరైన నాయకులను తయారు చేసుకోలేని పరిస్థితి ఉంది. నిస్వార్థం, సేవాగుణం కలిగిన నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉంది. మాతృభాషను మొదటి భాషగా పిల్లలకు చెప్పించాలి. భాష లేకపోతే చరిత్ర లేదు.. సంస్కృతి లేదు. భాష లేకపోతే మనం అంతరించిపోతాం. తెలుగువాడి తెలివితేటలకు జైజై.. తెలుగువాడు దేనికైనా సైసై..” అని సీజేఐ వెల్లడించారు.