ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

నన్ను మరోసారి అరెస్టు చేసేందుకు అధికారుల కుట్ర

భీమవరంలో తన ఇంటికి వెళ్లే దారిని అధికారులు తవ్వివేశారన్న ఎంపీ

ఏపి ప్రభుత్వంపై, అధికారులపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ రఘురామ కృష్ణ రాజు విమర్శలు చేశారు. తనను మరోసారి అరెస్టు చేసేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. భీమవరంలోని తన ఇంటికి వెళ్లే దారిని శుక్రవారం రాత్రి స్థానిక అధికారులు తవ్వేశారని ట్వీట్ చేశారు. తాను నడుచుకుంటూ వెళ్లేందుకే ఇలా చేశారన్నారు. బహుశా కేసు నమోదు చేసి తనను అరెస్టు చేసేందుకు అధికారులు పోలీసులతో కలిసి కుట్ర చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వీళ్ల క్రిమినల్ ఆలోచనలు నెవర్బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ సెటైర్ వేశారు.

వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకు అధికారి పార్టీతో పడటం లేదు. గత ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజులకే సీఎం జగన్, రఘురామకు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. పార్టీలో కొనసాగుతూనే వైఎస్‌ఆర్‌సిపి పాలన, జగన్ తీరుపై రఘురామ చాలాసార్లు ఘాటు విమర్శలు చేశారు. దాంతో, రఘురామపై ప్రభుత్వ పెద్దలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇది వరకు ఓ కేసులో రఘురామను అరెస్టు చేసి జైలుకు పంపారు.