Rahul Gandhi by telugoodu news
జాతీయం ముఖ్యాంశాలు

ఆహార ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ సరికాదు : రాహుల్ గాంధీ

ఒకే తక్కువ శ్లాబ్ జీఎస్టీ ఉంటే పేదలు, మధ్య తరగతి వారికి ప్రయోజనం

ఆహార ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ సరికాదు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తీరుపై మండిపడ్డారు. పలు రకాల ఆహార పదార్థాలు, ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. డబ్బున్న వారికి అనుకూలంగానే బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ మరోసారి మండిపడ్డారు. పలు సేవలు, ఉత్పత్తులపై జీఎస్టీని పోలుస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

‘‘హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా)పై 18 శాతం జీఎస్టీ, ఆస్పత్రుల్లో గదులపై 5 శాతం జీఎస్టీ.. అదే వజ్రాలపై మాత్రం 1.5 శాతమే జీఎస్టీ.. ప్రధాన మంత్రి ఎవరి పట్ల శ్రద్ధ చూపుతారనే బాధాకరమైన విషయానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) చిహ్నం. తక్కువ రేటుతో ఉండే ఒకే శ్లాబ్ జీఎస్టీతో అత్యవసరమైన, నిత్యావసరాల ధరలు నియంత్రణలోకి వస్తాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గుతుంది. అదే సమయంలో ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా పన్నులు పెంచడం ఆగిపోతుంది..” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ముందుగానే ప్యాక్ చేసి, లేబుల్ వేసిన మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె, గోధుమ, ఇతర ధాన్యాలు, బెల్లం, పేలాలను 5శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ జీఎస్టీ మండలి గత నెల 28 నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook: https://www.facebook.com/telugooduNews