భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో పరారీ
శ్రీలంక అధ్యక్షుడు: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజాందోళనలు ఉద్ధృతమైన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయినట్టు వైమానిక దళ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూసిన గొటబాయ అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. అధ్యక్ష పదవి నుంచి నేడు వైదొలగుతానని పార్లమెంటు స్పీకర్, ప్రధాని విక్రమసింఘేకు ఆయన ఇది వరకే తెలిపారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ మహీంద అభయ్‌వర్ధనేకు అందించినట్టు కూడా తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని స్పీకర్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదేశ ఇప్పటికే అంగీకరించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/