వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా బూస్టర్ డోసులపై అధికారులకు మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోసులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు కూడా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు వారికి సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల క్రితం వర్షాలు తగ్గిన తర్వాత డెంగ్యూ వ్యాధి విజృంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రబలుతుందని తెలిపారు. మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని హరీశ్‌రావు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/