తెలంగాణ ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం

రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం..ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌​ లోని పలు ప్రాంతాల్లో గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విధులు ముగించుకుని ఆ సమయంలో ఇళ్లకు వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాబాద్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, కాప్రా, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కోఠిలో వరద నీటిలో ఓ మోటారు బైక్ కొట్టుకుపోగా, మలక్‌పేట వంతెన దిగువన నడుము లోతులో నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంట జాతీయ రహదారిపైనా మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. దాదాపు మూడు గంటల పాటు వర్షం కురిసింది.

పలు చోట్ల భారీ వర్షాపాతం నమోదవగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. వర్షాలకు మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో వంతన వద్ద రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షానికి పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది శ్రమిస్తున్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/