2022-23 ఏడాదిలో రూ.44,574 కోట్ల రుణాలకు ఏపీకి అనుమతి
తొలి నెలలోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల చిట్టాను మరోసారి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా వివరాలు పేర్కొంది. అప్పు పుట్టిన ప్రతి చోటా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి అనుమతించిన రుణాల్లో సగానికి పైగా రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తొలి 3 నెలల్లోనే సేకరించిందని ఆయన వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణాలకు కేంద్రం అనుమతించిందని మంత్రి వివరించారు. ఇందులో మొదటి 9 నెలలకు గాను రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఉందని తెలిపారు. తొలి 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 50 శాతానికి మించి అప్పులు తీసుకుందన్నారు. అందులో ఏప్రిల్ నెల పూర్తయ్యేనాటికే… అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి నెలలోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకుందని మంత్రి తెలిపారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/