తెలంగాణ ముఖ్యాంశాలు

రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్‌ ఫై కేటీఆర్ ట్వీట్..ఆ ట్వీట్ చేసే అర్హత లేదన్న రాజాసింగ్

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారు.

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. కేటీఆర్ ప్రశ్నించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుపట్టారు.

ఈ రకంగా ట్వీట్ చేసే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. ‘గతం మర్చిపోయావా… మా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరంతా కలిసి సస్పెండ్ చేయలేదా? ఈరోజు మీరు సస్పెన్షన్ గురించి మాట్లాడతారా? మీరందరూ కలిసి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?’ అని మండిపడ్డారు.

ఇక కాలికి గాయం కారణంగా కేటీఆర్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండగా..ఆయనకు రాజాసింగ్ ఓ సలహా ఇచ్చారు. ‘కాలు విరిగిందని ఇంట్లో కూర్చున్నావు కదా. మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా. నేను ఒక సినిమా చెపుతా చూస్కో. ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడు. లేకపోతే ప్రధాని మోదీ స్పీచ్ కానీ, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి హిస్టరీ కానీ చూడు. మంచి మనిషివి అవుతావ్. నాస్తికుడివైన నీవు ఆస్తికుడివి అవుతావు. నీకు ఇది నా అడ్వైజ్’ అని అన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/